
తెలంగాణలో ఆల్ పార్టీ ఎంపీ సమావేశం రేపు (శనివారం) ప్రజాభవన్‌లో జరగనుంది. కేంద్రంలోని పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. తెలంగాణకు రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు మద్దతుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ఈ సమావేశ లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం పంపారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎంపీలను భట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు.
ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. జానారెడ్డి, భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్షంగా చర్చించేందుకు రేపు ఈ సమావేశం జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చర్చించాలనే ఉద్దేశ్యం ఉంది. బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రత్యేకంగా భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వివరించి, అందరి మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనే ప్రణాళిక రూపొందించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు సిద్ధమైంది. ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపించి, షెడ్యూల్ 9లో మార్పు చేయించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. దీనికి కేంద్రం నుంచి మద్దతు తీసుకురావడానికి ప్రధాన పార్టీ ఎంపీలను కలిసి చర్చించాలని భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు.
ఈ సమావేశం ద్వారా తెలంగాణకు రావాల్సిన హక్కులను పొందేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. ఢిల్లీ స్థాయిలో చేసే పోరాటానికి ముందుగా రాష్ట్ర స్థాయిలో అనుకూలతలను సృష్టించేందుకు ఈ భేటీ ఉపయోగపడనుంది. అన్ని పార్టీల నేతలతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
ఈ భేటీ ద్వారా తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో కొత్త మార్పులు వస్తాయా? రాష్ట్ర హక్కుల సాధనలో ఎంతవరకు ఫలితాలు సాధ్యమవుతాయో వేచిచూడాలి