
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించడంపై కేంద్రీకృతం కానుంది. సీఎం చంద్రబాబు ఉదయం 10:00 గంటలకు అమరావతిలోని ఉండవల్లిలో తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10:30కి కొవ్వూరు మండలం కాపవరం చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లికి చేరుకుని, 10:45 నుంచి 11:05 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటిని సందర్శించి, వారికి నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 11:10కు గ్రామ సభ వేదికకు చేరుకుని, మధ్యాహ్నం 12:40 వరకు లబ్ధిదారులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలు, అభిప్రాయాలు స్వయంగా తెలుసుకోనున్నారు.
మధ్యాహ్నం 12:50కు సీఎం చంద్రబాబు కాపవరం ఏ.ఎమ్.సి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ స్థానిక వ్యవసాయ సమస్యలు, మార్కెట్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. రైతులకు అనుకూలంగా ఉన్న విధానాల అమలు గురించి చర్చించే అవకాశం ఉంది.
తరువాత మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది. స్థానిక నేతలతో కలిసి స్థానిక సమస్యలపై దృష్టిసారించనున్నారు.
మూడు గంటలకు సమావేశం ముగిసిన అనంతరం, రోడ్డు మార్గంలో బయలుదేరిన చంద్రబాబు మధ్యాహ్నం 3:30కి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3:40కి విమానంలో బెంగుళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది.