
తీవ్ర గ్యాస్ట్రోఎంటెరైటిస్ సమస్యతో బాధపడుతున్న భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ అనారోగ్యం కారణంగా ఆయన విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనగలడా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. జైస్వాల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోంది.
గ్యాస్ట్రోఎంటెరైటిస్ ప్రభావంతో జైస్వాల్ గణనీయంగా బరువు తగ్గినట్లు వైద్యులు నిర్ధారించారు. శరీర బలహీనత, అలసట వంటి లక్షణాలు కనిపించడంతో ఆయనకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం శిక్షణకు దూరంగా ఉండాలని, ఆహార నియమాలు పాటించాలని వైద్యులు స్పష్టంగా తెలియజేశారు.
విజయ్ హజారే ట్రోఫీ వంటి కీలక దేశవాళీ టోర్నీ ముందు జైస్వాల్‌కు వచ్చిన ఈ అనారోగ్యం జట్టుకు కూడా దెబ్బగా మారే అవకాశం ఉంది. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్న జైస్వాల్, తన దూకుడు ఆటతో జట్టుకు బలమైన ఆరంభాలు అందిస్తూ వస్తున్నాడు. అలాంటి ఆటగాడి గైర్హాజరీ జట్టు వ్యూహాలపై ప్రభావం చూపవచ్చు.
అయితే జైస్వాల్ ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత అని జట్టు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. పూర్తిగా కోలుకున్న తరువాతే మైదానంలోకి దిగాలని నిర్ణయించారు. తొందరపడి ఆడితే భవిష్యత్‌లో మరింత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో, ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని వర్గాలు తెలిపాయి.
జైస్వాల్ త్వరగా కోలుకుని మళ్లీ బ్యాట్‌తో మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. యువ వయసులోనే భారత క్రికెట్‌కు కీలక స్థంభంగా మారుతున్న ఆయనకు సరైన విశ్రాంతి ఎంతో అవసరం. విజయ్ హజారే ట్రోఫీలో ఆడతాడా లేదా అన్నది వైద్య పరీక్షల అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.


