
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ప్రతిరోజూ భక్తులతో నిండిపోతూ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. విశేష పండుగలు, ఉత్సవాలు, ప్రత్యేక దినాలతో పాటు సాధారణ రోజుల్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే, ఈ నెలలో భక్తులకు టీటీడీ (TTD) నుండి ఒక ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. ఈ నెలలో ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
సెప్టెంబర్ 7, 2025న చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సంప్రదాయ ప్రకారం, గ్రహణ సూతకకాలం ప్రారంభమయ్యే సమయానికే ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం. ఈ క్రమంలో, టీటీడీ అధికారులు సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలయ తలుపులను మూసివేయనున్నారు. అనంతరం, గ్రహణం ముగిసిన తర్వాత సంప్రదాయ శుద్ధి కర్మలను నిర్వహించి, ఆలయాన్ని సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 3:00 గంటలకు భక్తులకు తిరిగి తెరవనున్నారు.
ఈ తాత్కాలిక మూసివేత వేలాది మంది భక్తుల దర్శన ప్రణాళికలకు ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల, టీటీడీ అధికారులు యాత్రికులకు ముందస్తు సూచనలు జారీచేశారు. శ్రీవారి దర్శనం కోసం బుక్ చేసుకున్న భక్తులు తమ స్లాట్లను సవరించుకోవాలని, అధికారిక టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కొత్త సమయాలను పరిశీలించాలని సూచించారు. సెప్టెంబర్ 8న తెల్లవారుజామున భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరుమల ఆలయం ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. ఆలయ సంప్రదాయాలను కాపాడటం, పవిత్రతను నిలబెట్టడం కోసం ఈ మూసివేత అవసరమని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రముఖ దేవాలయాలు కూడా గ్రహణ సమయంలో తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలుస్తోంది.