
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమిళనాడుకు కేంద్రం నిధులు సముచితంగా కేటాయించలేదన్న స్టాలిన్ మాటల్లో నిజం లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు. ముఖ్యంగా 2014 నుంచి 2024 వరకు కేంద్రం రూ. 5,08,337 కోట్లు విడుదల చేసిందని వివరించారు. తమిళనాడు ప్రభుత్వానికి నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిజమైన అన్యాయం ఎవరు చేశారో యూపీఏ, ఎన్డీఏ హయాంలో పంపిణీ అయిన నిధుల ఆధారంగా అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
తమిళనాడు కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తిరువన్నమలై, రామనాథపురంలో మరో రెండు జిల్లా కార్యాలయాల ఇ-ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు. 2025లో ఢిల్లీలో బీజేపీ మరోసారి గెలుస్తుందని, 2026లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వాన్ని “జాతి వ్యతిరేక ప్రభుత్వం”గా అభివర్ణించిన ఆయన, దీన్ని అస్తవ్యస్తం చేసే సమయం ఆసన్నమైందన్నారు.
తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే రోజే కొత్త శకానికి నాంది పలుకుతుందని అమిత్ షా చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో బంధుప్రీతి పెరిగిపోయిందని, అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతికి శాశ్వతంగా ముగింపు పలుకుతామని, రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో కూడా మహిళలకు భద్రత లేనట్టు అమిత్ షా పేర్కొన్నారు. వెంగైవాయల్ కేసులో నిందితులను 700 రోజులు గడిచినా అరెస్టు చేయలేకపోయారని డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించారు. డీఎంకే నాయకులు అవినీతి కేసుల్లో “మాస్టర్స్ డిగ్రీ” చేసినట్టు వ్యాఖ్యానించి, వారి పరిపాలన ప్రజలకు నష్టం చేస్తోందని విమర్శించారు. తమిళనాడు రాజకీయాల్లో డీలిమిటేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాలను కోరుకున్నవేనని అమిత్ షా అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలు డీఎంకే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు