
ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చివరికి ఓటమి ఎదురైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ అదిరిపోయే ప్రదర్శనతో 12 పరుగుల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు అపరాజితంగా దూసుకెళ్లిన ఢిల్లీకి ఇది మొదటి ఓటమిగా నిలిచింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (18) నిరాశపరిచినా, రికల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (50) మధ్య అద్భుత భాగస్వామ్యం ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ 33 బంతుల్లో 59 పరుగులతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులకే ఔటవగా, నమన్ ధీర్ 38 పరుగులతో ముంబై స్కోరును మరింత బలపరిచాడు.
గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ బౌలర్లు ఈసారి అంతగా ప్రభావం చూపలేకపోయారు. విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీసాడు. కానీ ముంబై బ్యాటర్లు ఆటను డామినేట్ చేశారు.
తర్వాత లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే దెబ్బతింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గార్క్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కానీ కరుణ్ నాయర్ మాత్రం ఒక్కడే పోరాడాడు. 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సులతో 89 పరుగులు చేసి ఢిల్లీ ఆశలు బతికించాడు. కానీ మిగతా బ్యాటర్లు అతని ప్రయత్నాన్ని నిలబెట్టలేకపోయారు. చివరికి ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌట్ అయింది.
ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న ముంబైకి ఈ గెలుపు ఊపిరి పీల్చుకునేలా చేసింది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన ముంబై, బలమైన ఢిల్లీ జట్టును ఓడిస్తూ కీలక విజయాన్ని సాధించింది.