
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2026–27 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO) మరియు మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 5,208 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి కనీసం 20 సంవత్సరాలు, గరిష్ఠంగా 30 సంవత్సరాల వయస్సులో ఉండాలి. అయితే రిజర్వుడ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, మాజీ సైనికులకు కూడా 5 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ జులై 1, 2025 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతుంది. చివరి తేదీ జులై 21, 2025గా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175 మాత్రమే. అభ్యర్థులను ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపిక చేస్తారు.
తుది ఎంపికకు మెయిన్స్‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం లభిస్తుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఇది ఒక స్థిరమైన మరియు గౌరవనీయమైన బ్యాంకు ఉద్యోగం కావడంతో యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
అర్హతలు ఉన్న అభ్యర్థులు తప్పక IBPS వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన భవిష్యత్తు కోసం ఇది ఒక గోల్డెన్ ఛాన్స్.


