
టీటీడీలోని అన్యమత ఉద్యోగులను గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తిరుమలలో శుక్రవారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు బండి సంజయ్కు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, టీటీడీలో హిందూ ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే ఉద్యోగుల ఉనికి చాలా ఆందోళనకరమని తెలిపారు.
టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని, వారిలో చాలామందికి హిందూ సనాతన ధర్మంపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ఇలాంటి వారు తిరుమల శ్రీవారిని సేవించేందుకు అనర్హులని స్పష్టం చేశారు. ఒకరిని తొలగించడం సరిపోదని, వారందరినీ గుర్తించి తక్షణమే విధుల నుంచి తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పాలకమండలి వెంటనే స్పందించాలని కోరారు.
అయితే ఈ సమస్య కేవలం తిరుమలకే పరిమితం కావద్దని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ దేవాలయాల్లోనూ ఇలాంటి పరిణామాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు, పురాతనమైన ఆలయాల అభివృద్ధికి టీటీడీ ముందుకు రావాలని కోరారు. ప్రజలు విశ్వాసంతో నమ్మే దేవస్థానాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇల్లెందు రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, వేములవాడ రాజరాజేశ్వరాలయానికి టీటీడీ సహకారం అవసరమని బండి సంజయ్ తెలిపారు. ఆలయ అభివృద్ధి ద్వారా భక్తుల సౌకర్యాలు మెరుగుపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
శ్రీవారి సేవలో భక్తితో, నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులకే అవకాశం కల్పించాలన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కేంద్రం కూడా అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.