
కుల వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, మహిళల హక్కుల కోసం కూడా పోరాడిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. అతని భార్య సావిత్రిబాయి ఫూలే కూడా భర్త అడుగుజాడల్లో నడిచి సమాజంలో సమానత్వాన్ని స్థాపించేందుకు కృషి చేశారు. వీరి స్ఫూర్తిదాయక జీవిత గాథను ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
సమాజంలోని అసమానతలపై నిరంతరం పోరాడిన జ్యోతిరావు ఫూలే భారతదేశంలోని అట్టడుగు వర్గాల హక్కుల కోసం నిరసన గళం వినిపించిన మహానీయుడు. బ్రిటీష్ పాలనలో స్వేచ్ఛను కోరుకోవడంతో పాటు, దేశీయంగా ఉన్న కుల వివక్ష, అణచివేతపై ఉధృతంగా పోరాడారు. భార్య సావిత్రిబాయి సహకారంతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు.
ఈ మహోన్నత వ్యక్తి జీవితం ఆధారంగా దర్శకుడు అనంత్ మహదేవన్ (Ananth Mahadevan) ‘జ్యోతిరావు ఫూలే’ బయోపిక్‌ను తెరకెక్కించారు. మార్చి 24న చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఏప్రిల్ 11న జ్యోతిరావు జయంతి సందర్భంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ (Pratik Gandhi) జ్యోతిరావుగా నటించగా, పత్రలేఖా (Patralekhaa) ఆయన భార్య సావిత్రిబాయి పాత్రను పోషించారు. ట్రైలర్‌ను చూస్తే, ఈ దంపతుల అన్యాయాలపై పోరాటం, బాలికల విద్య కోసం చేసిన కృషిని హృదయానికి హత్తుకునేలా చూపించినట్టు అనిపిస్తోంది.
కుల వివక్ష, బాలికల విద్య, వితంతు మహిళల హక్కుల కోసం అణచివేతలను ఎదుర్కొని నిలబడ్డ జ్యోతిరావు దంపతుల పోరాట గాథ ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని ఈ చిత్రం అందజేస్తోంది.