
యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా “సయారా” (Saiyaara) నుంచి ఐదో పాట ‘ధన్’ విడుదలైంది. మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విడుదలైన ‘ధన్’ సాంగ్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది.
ఈ పాట కోసం బాలీవుడ్ మ్యూజిక్ ప్రపంచంలో ట్రెండింగ్ కాంబినేషన్ అయిన అర్జిత్ సింగ్, మిథున్, మోహిత్ సూరి మరోసారి చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘తుమ్ హి హో’, ‘హమారి అధూరీ కహాని’ వంటి హృదయస్పర్శక గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తాజా పాట ‘ధన్’లో కూడా అదే భావోద్వేగాన్ని నిండి ఉంది.
‘ధన్’ పాట ఓ సాధారణ యువకుడి జీవితంలో ఎదురయ్యే పోరాటాలను, ప్రేమలో ఎదుర్కొనే అడ్డంకులను సంగీత రూపంలో ఆవిష్కరిస్తుంది. జీవితం సునాయాసంగా ఉండదని, కానీ ఆ పోరాటంలోనే అందం ఉందని తెలియజేస్తుంది. ఈ సాంగ్‌ను ప్రేక్షకులు ఇప్పటికే భావోద్వేగపూరితంగా స్వీకరిస్తున్నారు.
ఈ సినిమాలో అహాన్ పాండే హీరోగా బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమాతోనే అతను బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ఆయన సరసన అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటిస్తోంది. నూతన జంట అయినప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రీ ఇప్పటికే టీజర్ల ద్వారా చర్చనీయాంశంగా మారింది.
“సయారా” సినిమాను జులై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ముఖ్యంగా ‘ధన్’ సాంగ్ విడుదలతో ఈ చిత్రానికి మంచి మ్యూజికల్ హైప్ ఏర్పడింది.


