
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పవన్ కల్యాణ్, జనసేన పార్టీ గురించి ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలిపారు. తనకు ఏ పదవులు అవసరం లేవని, పవన్ కల్యాణ్ సహచర్యం మాత్రమే తనకు ముఖ్యం అని అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో భావోద్వేగానికి లోనై, ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో తనపై జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తూ, పవన్ కల్యాణ్ మంచితనాన్ని పొగిడారు.
పవన్ కల్యాణ్‌పై బాలినేని భారీ ప్రశంసలు కురిపించారు. “పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నాయకుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎప్పుడూ విమర్శించలేదు. పైగా, మంచి వ్యక్తిగా పొగిడాడు” అని తెలిపారు. అప్పటికి జనసేనలో చేరకపోవడం తన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. “నేను కూటమిని విడగొడతానని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. కానీ పవన్ కల్యాణ్ పేరుకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని నేను జాగ్రత్తపడ్డా” అన్నారు. తన చేరికకు అసలు కారణం పవన్ కల్యాణ్ ఇంకా ఎదగాలన్న ధ్యేయమే అని తెలిపారు.
తాను జనసేనలో చేరడానికి ఏదైనా స్వార్థపూరిత ఉద్దేశం ఉందన్న ప్రచారం జరుగుతోందని బాలినేని అన్నారు. “పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనే కండీషన్‌తోనే పార్టీలో చేరారని” వచ్చిన వార్తలను ఖండించారు. “నా ప్రాణం ఉన్నంత వరకు జనసేనలోనే ఉంటా. పవన్ కల్యాణ్తోనే కలిసి పని చేస్తా” అని స్పష్టం చేశారు. జగన్‌ను ఉద్దేశిస్తూ, “మీ నాన్న దయతో సీఎం అయ్యావు. మళ్లీ అవ్వగలవో చూడాలి” అంటూ సవాల్ విసిరారు.
పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్నీ నిజాలే చెబుతున్నానంటూ, జగన్ తనపై చేసిన అన్యాయాన్ని బయటపెట్టారు. “జగన్ నా ఆస్తులను కాజేశాడు. నా బాధ, నా కుటుంబం అనుభవించిన ఇబ్బందులు వేరెవరికీ రాకూడదు” అని అన్నారు. తన అనుభవాలను ఒక్కరోజులో చెప్పడం కుదరదని, ఒక్కో విషయం బయట పెడతానని అన్నారు.
తన మీద విచారణ జరిపించాలని, ఎవరెవరు కోట్ల రూపాయలు సంపాదించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. “వైఎస్సార్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఆయన రాజకీయ భిక్ష పెట్టారు. కానీ జగన్ నాకు చేసిన అన్యాయం తట్టుకోలేకపోతున్నాను” అని అన్నారు. “తన పదవి ఇంకా నాలుగేళ్లు ఉండగా వదిలేశాను. కానీ జగన్ నాకు మంత్రి పదవి ఇచ్చి వెంటనే తీసేశారు. అయినా నేను భాధపడలేదు” అని తెలిపారు. తన అనుభవం మిగతా ఎవరికీ రాకూడదని, ఇంకా ఎన్నో విషయాలు బయటపెడతానని బాలినేని హెచ్చరించారు.