
గుంటూరు జిల్లాలో విషాదం – చెరువులో జారి టెన్త్ విద్యార్థి మృతి
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వట్టి చెరుకూరులో బీసీ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థి కిషోర్ చెరువులో జారి మృతి చెందాడు. గురువారం ఉదయం హాస్టల్‌లో నీటి కొరత ఉండటంతో, కిషోర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు చెరువుకు వెళ్లారు. నీరు తేకపోవడంతో స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన కిషోర్ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు.
స్నేహితుడిని కాపాడేందుకు మరో ఇద్దరు విద్యార్థులు వెంటనే నీటిలోకి దిగారు. అయితే వారు కూడా జారిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. స్థానిక గ్రామస్థులు అప్రమత్తమై వెంటనే నీటిలోకి దిగి ఆ ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ కిషోర్‌ను కాపాడే ప్రయత్నం విఫలమైంది.
కిషోర్‌ది వెల్దుర్తి మండలం, గంగలకుంట గ్రామం. చెరువులో మునిగి అతను ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన చూసిన స్థానికులు దుఃఖానికి లోనయ్యారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్‌లో నీటి కొరత కారణంగా విద్యార్థులు చెరువుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు గుర్తించారు. విద్యార్థి మృతిపై గ్రామస్థులు, తల్లిదండ్రులు హాస్టల్ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు.
ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యార్థి మృతితో బీసీ వసతి గృహంలో ఉన్న విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.