
నారాయణపేట జిల్లాలో చిన్నారుల బాల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్లాల్సిన వయసులో కొంతమంది పిల్లలు హోటళ్లు, ఇటుక భట్టీలు, మెకానిక్ షాపులు, పరిశ్రమల్లో శ్రమిస్తున్నారు. ఇది వారి చదువును, భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితికి ముగింపు పలకడం కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది.
జూలైలో “ఆపరేషన్ ముస్కాన్”, జనవరిలో “ఆపరేషన్ స్మైల్” పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఏడాది జూలై 1 నుండి 11వ ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా అధికారుల ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తాయి. అకస్మికంగా వ్యాపార కేంద్రాలు, పరిశ్రమల్లో తనిఖీలు జరిపి బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోనున్నారు.
ఈ బృందాలపై నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్‌పీ యోగేష్ గౌతమ్‌లు పర్యవేక్షణ చేస్తారు. ఇప్పటికే డీఎస్పీ లింగయ్య, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరగ్గా, చిన్నారులను యాచక వృత్తిలోకి నెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత అరేళ్లలో ప్రభుత్వ చర్యలతో 1,078 మంది బాల కార్మికులను చట్టబద్ధంగా రక్షించి, వారికి చదువునూ భద్రతనూ కల్పించారు. ప్రజలు కూడా చైతన్యవంతంగా ఉండి, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా పోలీసు నెంబర్ 100కు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. చిన్నారుల బాల్యాన్ని చిరునవ్వుల వరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.


