
బాలీవుడ్‌కు ఊపిరి పోసిన ‘ఛావా
ఈ ఏడాది జనవరి నెల బాలీవుడ్‌కు పెద్దగా కలిసి రాలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సోనూ సూద్ ‘ఫతే’, అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’, కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ చిత్రాలు పర్వాలేదనిపించినా, చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేకపోయాయి. షాహిద్ కపూర్ ‘దేవా’ సినిమా అయితే ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2013లో వచ్చిన మలయాళ చిత్రం ‘ముంబై పోలీస్’కు రీమేక్ అయిన ఈ సినిమాను తెలుగులో సుధీర్ బాబు ‘హంట్’ పేరుతో రీమేక్ చేయగా, అక్కడ కూడా ఫ్లాప్ అయింది. తమిళంలో ‘లవ్ టుడే’కి రీమేక్‌గా శ్రీదేవి చిన్న కూతురు ‘లవ్ యాపా’ తీయగా, ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అజయ్ దేవ్గన్, అతని మేనల్లుడు ఆమన్ దేవ్గన్ నటించిన ‘ఆజాద్’ కూడా అదే బాటలో నడిచింది. ఇలా వరుస పరాజయాలతో జనవరి, ఫిబ్రవరి మొదటి వారం నిరాశగా గడిచిపోయాయి.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న విడుదలైన ‘ఛావా’ సినిమాపై భారీ ఆశలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదల కాగానే జాతీయ మీడియా భిన్న స్పందనలు వ్యక్తం చేసింది. కొందరు విమర్శకులు సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా విక్కీ కౌశల్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అతని భార్య యేసు బాయిగా నటించిన రష్మిక మందణ్ణకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ, కనిపించిన సన్నివేశాల్లో బాగా చేసిందని అభినందించారు. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తే, మరికొన్ని కన్నీళ్లు తెప్పించాయని అన్నారు. నెమ్మదిగా ‘ఛావా’ ప్రేక్షకులకు చేరుకోవడం మొదలైంది. ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకులు గుంపులు గుంపులుగా చూస్తున్నారు. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలో ఈ సినిమాను ఆదరించడం మొదలుపెట్టారు. థియేటర్లలో ‘జై శివాజీ జై భవానీ, శంభాజీ మహారాజ్ కీ జై’ అంటూ యువత నినాదాలు చేస్తున్నారు.
విశేషం ఏమంటే, ‘ఛావా’ సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం, మొదటి రోజున ఈ సినిమా రూ. 33.10 కోట్ల గ్రాస్‌ను, రెండో రోజు 39.30 కోట్ల గ్రాస్‌ను, మూడో రోజైన ఆదివారం 49.3 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. అంటే ఆదివారానికి ఈ సినిమా రూ. 121.43 కోట్ల గ్రాస్‌ను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఒకరకంగా ‘ఛావా’ మొదటి రోజు కలెక్షన్లు కూడా రికార్డ్ సృష్టించినట్టే. ఎందుకంటే విక్కీ కౌశల్ కెరీర్లో ఇంతవరకు మొదటి రోజున డబుల్ డిజిట్ సాధించిన సినిమానే లేదు. ఆ లోటును ‘ఛావా’ తీర్చేసింది. విక్కీ కౌశల్ సినిమాల్లో మొదటి రోజున ‘బ్యాడ్ న్యూస్’ రూ.8.62 కోట్లు, ‘ఉరి’ రూ.8.20 కోట్లు, ‘రాజీ’ రూ. 7.53 కోట్లు, ‘శామ్ బహదూర్’ రూ. 6.25 కోట్లు, ‘జరా హఠ్ కే జరా బచ్ కే’ రూ. 5.49 కోట్లు, ‘భూత్’ రూ. 5.10 కోట్లు, ‘మన్ మర్జియాన్’ రూ. 3.52 కోట్లు, ‘రామన్ రాఘవన్ 2.0’ రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలు చేశాయి. దాంతో ‘ఛావా’కు వచ్చిన ఓపెనింగ్స్‌తో విక్కీ కౌశల్, అతని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. మహారాష్ట్రలో దీనిని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు పబ్లిక్ హాలిడే కూడా. కాబట్టి శివాజీ తనయుడు శంభాజీ సినిమా ‘ఛావా’ను చూడటం కంటే వారికి మరో ప్రత్యామ్నాయం లేదు! ఆ రోజున కూడా యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అదే జరిగితే, ‘ఛావా’ సినిమా బుధ, గురువారాలకు రెండు వందల కోట్ల క్లబ్లో చేరిపోవడం ఖాయం.