
కేవలం ఒక వారంలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఉత్సాహాన్ని అందించారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాలు భారత్‌ను గ్లోబల్ వేదికపై మరింత బలోపేతం చేశాయని ఆయన అన్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడంలో ఈ వారం అత్యంత కీలకమైనదిగా నిలిచిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కుదిరిన ఈ రెండు కీలక ఒప్పందాలు దేశ ఎగుమతుల రంగానికి కొత్త దిశను చూపనున్నాయని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందనడానికి ఇవి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
గత వారం యూరప్ దేశాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందం యూరోప్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు భారీ ప్రాధాన్యతను కల్పించనుందని పవన్ కల్యాణ్ వివరించారు. ఇది కేవలం వాణిజ్య పరమైన ఒప్పందమే కాకుండా, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. దీని వల్ల పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కుదిరిన తాజా ఒప్పందం భారతీయ వ్యాపారులకు, ముఖ్యంగా రైతులకు వరప్రదాయినిగా మారనుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సుంకాల ఛార్జీలను 18 శాతానికి తగ్గించడం వల్ల అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తుల ధరలు తగ్గి, పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. దీని వల్ల భారత ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం ద్వారా రైతుల ఆదాయం మెరుగుపడుతుందని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడడమే కాకుండా, కోట్లాది మంది జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తాయని తెలిపారు. ఈ గొప్ప విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


