
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీరింగ్ వారసత్వాన్ని సజీవంగా నిలిపే వ్యక్తి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్. ఆయన తెలంగాణ బిడ్డల ప్రతిభకు సృజనాత్మకతకు తార్కాణంగా నిలిచారు. నీటిపారుదల రంగంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది.
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ గారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, దిండి, కోయెల్ సాగర్, కడెం, పోచంపాడు, లోయర్ మానేరు వంటి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, అవి నేటికీ సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈయన దార్శనికతతో నిర్మితమైన ప్రాజెక్టులు వేలాది రైతులకు ఆర్థిక భద్రత కలిగించాయి.
కేవలం నీటిపారుదల ప్రాజెక్టులే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, అఫ్జల్‌గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆసుపత్రి వంటి ప్రతిష్ఠాత్మక భవనాలు కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. ఇవన్నీ నేడు తెలంగాణ నగరాల్లో కళా, విద్యా, వైద్య రంగాల్లో అత్యంత ముఖ్యమైన కేంద్రములుగా నిలిచాయి.
ఈ మహానుభావుడి సేవలకు గౌరవంగా, ప్రతీ ఏడాది జూలై 11వ తేదీని “తెలంగాణ ఇంజినీర్స్ డే”గా జరపాలని 2014లో మాజి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ శాస్త్రానికి, నిపుణుల సేవలకు గుర్తింపు ఇస్తూ వేడుకలు జరుగుతున్నాయి.
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ జయంతి సందర్భంగా, రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరుకూ మనస్ఫూర్తిగా తెలంగాణ ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు. మీ కృషితో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం.