
స్టార్ హీరో విజయ్, తమిళగ వెట్రికళగం పార్టీ చీఫ్, రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతుండగా, వారిని మాయమాటలతో మోసం చేయొద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కులను పట్టించుకోకుండా ప్రభుత్వం ఎలాంటి కపటనాటకాలాడినా, చివరకు దాని పతనమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
జాక్టో-జియో సంఘాలు చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని విజయ్ ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వం నిత్యం మోసం చేస్తూ, వాగ్దానాలు తప్ప వాస్తవ చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆయన అన్నారు. వీరి ఆందోళన లక్షలాది ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉందని ప్రభుత్వానికి గుర్తుచేశారు.
2003 ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన ఉద్యోగులకు పాత పింఛన్ పద్ధతి అమలు చేయకపోవడం అన్యాయం అని విజయ్ మండిపడ్డారు. రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా పింఛన్ పొందే హక్కు ఉద్యోగులకు ఉందని, కానీ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ ద్వారా వారికి అన్యాయం చేస్తోందని విమర్శించారు.
డీఎంకే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఉద్యోగుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని విజయ్ సూచించారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో 309వ హామీని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ప్రచారార్భాటాలకే ప్రాధాన్యం ఇస్తూ, ఉద్యోగుల సమస్యలను లైట్ తీసుకుంటే ప్రభుత్వానికి చేదు అనుభవమే ఎదురవుతుందని విజయ్ స్పష్టంగా హెచ్చరించారు.