
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులకు విపరీతమైన ఉత్సాహాన్ని అందించిన ఐపీఎల్ 2025 ఎట్టకేలకు తన తుది అంకానికి చేరుకుంది. మిగిలిన కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉండటంతో పోటీ మరింత ఉత్కంఠగా మారింది. ఫైనల్స్ బరిలో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ క్రమంలో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓటమి చెందిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆశ్చర్యకరంగా, ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. అందుకే ఈ మ్యాచ్ విజేతగా నిలిచి టైటిల్ ఆశలను కొనసాగించాలన్న ఉద్దేశంతో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.
ఆర్సీబీకి జాష్ హాజెల్‌వుడ్ తిరిగి రావడం పెద్ద ఊరటగా మారింది. లఖ్నోతో జరిగిన గత మ్యాచ్‌కు అతను దూరంగా ఉన్నా, ఈ మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి హాజెల్‌వుడ్ ఈ సీజన్ టాప్ బౌలర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ మాదిరిగానే ఫామ్‌లో ఉన్న ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, జితేష్ శర్మ కీలక బ్యాటర్లు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, షెపర్డ్, కృనాల్ పాండ్యా ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్‌లో ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా లాంటి ప్లేయర్లు ఉన్నారు. గత మ్యాచ్‌లో జాస్ ఇంగ్లీష్ మ్యాచ్విన్నింగ్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, యన్‌సెన్, హర్‌ప్రీత్ బ్రార్ రాణిస్తున్నారు. గత మ్యాచ్‌కు దూరమైన యుజ్వేంద్ర ఛాహల్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశముంది.
ఈ నేపథ్యంలో PBKS vs RCB మ్యాచ్ అభిమానులకే కాదు, రెండు జట్లకు కీలక మలుపుగా మారనుంది. జట్టు కాంబినేషన్లు, ఫామ్ ఆధారంగా ఈ పోరు ఆసక్తికరంగా సాగనున్నట్లు స్పష్టమవుతోంది.