
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ల్యాండ్ పూలింగ్ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. ల్యాండ్ పూలింగ్‌పై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలోనే కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలిపారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించిన నారాయణ, రెండో విడతకు సంబంధించి అవసరమైన సబ్‌కమిటీ సమావేశాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు.
అమరావతిలో లీగల్, టెక్నికల్ సమస్యలు పూర్తిగా పరిష్కరించామని మంత్రి నారాయణ వెల్లడించారు. సోమవారం ఆయన అమరావతిలో పర్యటించారు. ఇప్పటికే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలవగా, పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రుల బంగ్లాలు పరిశీలించి, 12 టవర్లను కేటాయించినట్లు చెప్పారు. వీటిలో మొత్తం 288 అపార్ట్‌మెంట్లు ఉండనున్నాయని వివరించారు.
ఆలిండియా సర్వీస్ అధికారుల కోసం 6 టవర్ల నిర్మాణం కొనసాగుతోందని, గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పటికే పూర్తయిందన్నారు. నాన్ గెజిటెడ్ అధికారుల నివాస గృహాల టవర్లు కూడా పూర్తికావస్తున్నాయని తెలిపారు. హ్యాపీనెస్ట్ పథకంలో మరో 6 టవర్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. మార్చి 31 లోపు ఈ నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే, డిసెంబర్ నాటికి ఆలిండియా సర్వీస్ టవర్లు సిద్ధం కానున్నాయని, ఐకానిక్ టవర్ డిజైన్‌లు కూడా తుది దశకు వచ్చాయని తెలిపారు. నార్మన్ ఫోస్టర్ బృందం అమరావతికి వచ్చి చర్చలు జరుపనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 75 ప్రైవేట్ కంపెనీలకు భూమి కేటాయింపు పూర్తయిందన్నారు.
మొత్తంగా అమరావతిని విశ్వస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల నుంచి మొదలుకుని అధికారుల వరకూ అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి నారాయణ అన్నారు. జగన్ హయాంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ప్రజలకు నమ్మకం కలిగించేలా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.