
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఇది భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక విధానంలో కీలక మార్పులు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా ఉద్యోగాల నియామకాల్లో వేగం పెంచేలా, నిరుద్యోగులపై భారం తగ్గించేలా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణపై కొత్త మార్గదర్శకాలు రూపొందించాయి. ఇకపై ఖాళీల కన్నా 200 రెట్లు ఎక్కువ దరఖాస్తులు వచ్చినపుడే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది.
ఇప్పటివరకు ఏపీపీఎస్సీ విధానంలో 25,000 మందికి పైగా అభ్యర్థులు ఉన్నపుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేది. అయితే, ఈ నిబంధనను సడలించి, మరింత స్పష్టతనిచ్చేలా మార్పులు చేశారు. ఇది ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఒకే మెయిన్స్ పరీక్ష ద్వారా నియామక ప్రక్రియను పూర్తిచేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులు ఎక్కువ పరీక్షలు రాయకుండానే ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు.
ఈ మార్పుల వల్ల నిరుద్యోగులపై ఉన్న ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. మళ్లీ మళ్లీ దరఖాస్తులు, పరీక్షల ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. సమయం, ఖర్చు రెండింటినీ తగ్గించే ఈ మార్గదర్శకాలు అభ్యర్థుల మేలు కోరే విధంగా రూపొందించబడ్డాయి. ఇక ఒక్కసారి మెయిన్స్ పరీక్ష రాస్తే చాలనటంతో అభ్యర్థులకు భారీ ఊరట లభిస్తుంది.
ప్రభుత్వం అధికారికంగా ఈ మార్పులను ఉత్తర్వుల రూపంలో ప్రకటించింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కొత్త విధానం అడ్మినిస్ట్రేటివ్‌గా, ఎకనామికల్‌గా సమర్థవంతంగా పని చేస్తుందన్నది అధికారుల అభిప్రాయం.
ఈ మార్పులతో లక్షలాది మంది నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాలపై నమ్మకం పెరుగుతుంది. పరీక్షల ఒత్తిడి తగ్గడంతో పాటు అవకాశాలను సమంగా అందించే అవకాశముంది. ఇది నిరుద్యోగులకు మరింత శ్రేయస్సు తీసుకురానుంది.


