
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పార్టీ క్రమశిక్షణపై మరోసారి తన కఠిన వైఖరిని ప్రదర్శించారు. టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం లో ఉన్న కొంతమంది నేతలు పార్టీ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో, వారిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియంత్రణ రహితంగా వ్యవహరించే నేతలపై తన, మన అనే బేధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు (Chadalavada Aravindababu) చర్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
గురువారం రాత్రి నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే చదలవాడ, తన చెప్పిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడే పడుకుని నిరసన తెలిపారు. అంతేకాకుండా, ఎక్సైజ్ కమిషనర్‌ను కార్యాలయం నుంచి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అధికారులను బలవంతంగా తన మాట విన్నించే ప్రయత్నం చేయడం పార్టీ లైన్‌ను దాటి వ్యవహరించినట్లుగా మారింది. ఈ వ్యవహారంపై చంద్రబాబుకు పార్టీ వర్గాలు వివరాలు అందించాయి. దీంతో ఆయన చదలవాడ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Kollikapudi Srinivas) పైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళపై దాడి సహా, నియోజకవర్గంలో పలువురిని వేధించారంటూ వచ్చిన ఆరోపణలపై ఆయన సీరియస్ అయ్యారు. దీనిపై వివరణ ఇవ్వాలని, అలాగే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
టీడీపీ క్రమశిక్షణను అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ పరిపాలనలో సజావుగా నడవాల్సిన బాధ్యత వారిపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ లైన్‌ను దాటి ప్రభుత్వ పరిపాలనకు అంతరాయం కలిగించేలా వ్యవహరిస్తే, సంబంధిత నేతలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండబోమని హెచ్చరించారు.
చదలవాడ, కొలికపూడి శ్రీనివాస్ లాంటి నేతలు ప్రజాసేవ మీద దృష్టి పెట్టాలని, పార్టీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. వివాదాలకు దూరంగా ఉండాలని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోకూడదని హెచ్చరించారు. పార్టీలో శృతిమించి వ్యవహరించే నేతలకు, రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడేలా చేస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈ ఘటనలతో టీడీపీలో క్రమశిక్షణ పట్ల చంద్రబాబు తీసుకునే తీరు మరోసారి స్పష్టమైంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ చోటుచేసుకుంటే, మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.