
“ఎంతో మంది పాలకులు వచ్చారు. ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారు. తప్ప జిల్లాను అభివృద్ధి చేయలేదు”.. అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.
“నీళ్లు… నాగరికతను తెస్తాయి. పంటలు తీసుకొస్తాయి. పసిడి బంగారాన్ని పండిస్తాయి. కానీ రావాల్సిన నీళ్లు రాలేదు. పాలమూరు జిల్లాలో 800 లకు పైగా టీఎంసీ నీరు పారుతున్నా.. పసిడి పంటలు రాలేదు. మా కష్టాలు తీరలేదు. మా కన్నీళ్లు తుడవలేదు”.
“ఈ ప్రాంతం నుంచి నీళ్లు తరలిపోతున్నా.. కృష్ణా జలాలు మాకు తాగడానికి, సాగు చేసుకోవడానికి రాకపోయినా… ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, తట్టపని, పార పని, మట్టి పనితో పాలమూరు బిడ్డలు దేశంలోని ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాల్లో పనిచేశారు. ప్రాజెక్టుల్లో పాలమూరు బిడ్డల స్వేదముంది. మా రక్తం ఉంది. మా కష్టం ఉంది. అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మందిగా మేస్త్రీల వెంట వలసలు పోతుంటే… ఆ వలసలు ఆపాలని, ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం.”
“గడిచిన పదేళ్లలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈరోజు పక్కరాష్టంతో నీటి పంచాయితీ ఉండేదు కాదు. పాలమూరు జిల్లా భవిష్యత్తు యువకుల మీద ఆధారపడి ఉంది. పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా నెట్టంపాడు, కోయిల్ సాగర్, మక్తల్ నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. అందరూ అండగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా” అని ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ బహిరంగా సభలో పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సలహాదారులు పాల్గొన్నారు.