
విశాఖపట్నం, ఆగస్టు 13:
ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు శనివారం వరకు సముద్రయానానికి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ప్రభావం చూపనుంది.
శుక్రవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గినప్పటికీ, గురువారం సాయంత్రం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగింది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 5.46 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిన వాగులు, కాలువలు దాటరాదని అధికారులు సూచించారు.
సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, విపత్తుల నిర్వహణ సంస్థ నుండి విడుదలయ్యే అధికారిక హెచ్చరికలను మాత్రమే విశ్వసించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గత 24 గంటల్లో ఎన్టీఆర్ జిల్లాలో 94 మి.మీ., కోనసీమలో 90.8 మి.మీ., పశ్చిమగోదావరిలో 90 మి.మీ., ఏలూరులో 65.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 52 మి.మీ., శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో 48.2 మి.మీ., అనకాపల్లి జిల్లా గంధవరంలో 38 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.