
తమిళనాడు మద్యం దుకాణాల అవినీతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji) కౌంటర్ ఇచ్చారు. ఈడీ చేసిన అభియోగాలను తాము తీవ్రంగా ఖండిస్తామని, అవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని అన్నారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం అనివార్యమని స్పష్టం చేశారు.
ఈ నెల 6వ తేదీన టాస్మాక్ (TASMAC) ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. టాస్మాక్ మద్యం దుకాణాల్లో రూ. వెయ్యి కోట్లకుపైగా అవినీతి జరిగిందంటూ ఈడీ తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దీనిపై మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ మీడియాతో స్పందిస్తూ, ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.
ఈడీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టత లేకపోవడంతో, ఆ ఆరోపణలన్నీ అసత్యమని మంత్రి స్పష్టం చేశారు. 2023లో మూతపడిన టాస్మాక్ దుకాణాల సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశామని, అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని వివరించారు. రవాణా ఒప్పందాల్లో అత్యల్ప ధర కోట్ చేసిన కంపెనీలకే కాంట్రాక్ట్లు అప్పగించామని, అందులో పూర్తి పారదర్శకత ఉందని పేర్కొన్నారు.
టాస్మాక్ దుకాణాల నగదు లావాదేవీలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, ఈడీ చేసిన అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి తాము న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వాన్ని కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈడీ తనిఖీల్లో టాస్మాక్ అవినీతికి సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. పలువురు టాస్మాక్ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసి విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ అవినీతిలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే, సంబంధిత అధికారులను అరెస్టు చేసే అవకాశముందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వం ఈడీ ఆరోపణలను ఖండించినప్పటికీ, ఈ విచారణ ఎటు దారితీస్తుందో చూడాలి.