
యూత్‌ను ఆకట్టుకునే కొత్త కాన్సెప్ట్‌తో, స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్’ (Pathang Movie) ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. పతంగుల పోటీని ప్రధానాంశంగా తీసుకొని రూపొందించిన ఈ యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్య పాత్రల్లో నటించగా, గౌతమ్ వాసుదేవ మీనన్, ఎస్.పీ. చరణ్ కీలక పాత్రల్లో కనిపించనుండటం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు సమర్పణలో సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. యూత్ టేస్ట్‌కు తగ్గ కథ, హై ఎనర్జీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుంది.
తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు దేవకట్టా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ, “ఇది పూర్తిగా కొత్త తరహా సినిమా. ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ సమపాళ్లలో ఉన్నాయి. ఫ్రెండ్‌షిప్, లవ్, మ్యూజిక్, యూత్ ఎనర్జీ అన్నీ బలంగా కనిపిస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది” అని ప్రశంసించారు.
నిర్మాత నాని బండ్రెడ్డి గురించి దేవకట్టా ప్రత్యేకంగా మాట్లాడుతూ, “సినిమాల కోసం ప్రాణం పెట్టే వ్యక్తి. ఈ ప్రాజెక్ట్‌లో హిట్ కళ స్పష్టంగా కనిపిస్తోంది” అన్నారు. ట్రైలర్‌లోని విజువల్స్, పతంగుల పోటీ సన్నివేశాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
ఇక నటులు ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ మాట్లాడుతూ, “ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. చివరి 30 నిమిషాల కైట్ కాంపిటీషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీయాలంటే నిజంగా ధైర్యం కావాలి. మా నిర్మాతలు పెద్ద సినిమాకు తగ్గ క్వాలిటీతో ఈ ప్రాజెక్ట్ చేశారు. మా పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి” అన్నారు. వడ్లమాని శ్రీనివాస్ తన వందో సినిమా ఇదేనని పేర్కొంటూ, యూత్ ఎనర్జీతో రూపొందిన ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.


