
అజిత్ దోవల్ జీవితంలోని సంఘటనలకు స్ఫూర్తిగా రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ ‘సలాకార్’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియా–పాక్ సంబంధాలపై ఆసక్తికరమైన కథతో రూపొందిన ఈ సీరిస్ మొదటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వాతావరణంలో గూఢచారి కార్యకలాపాలు, అణ్వస్త్ర ప్రణాళికలు, రహస్య ఆపరేషన్లు ఈ కథలో ప్రధానాంశాలుగా ఉంటాయి.
1978లో ప్రారంభమైన కథ, 2025 వరకూ కొనసాగుతుంది. అశ్ఫాక్ ఉల్లా (సూర్య శర్మ) అనే పాకిస్థానీ బ్రిగేడియర్ తన తాతయ్య జియా-ఉల్-హక్ (ముఖేష్ రిషి) వదిలి వెళ్లిన అణుబాంబు తయారీ బ్లూప్రింట్‌ను కనుగొంటాడు. భారత్‌పై అణ్వస్త్ర దాడి చేయాలని నిర్ణయించుకున్న అశ్ఫాక్ ప్రణాళికను, పాకిస్థాన్‌లో పనిచేస్తున్న రా సీక్రెట్ ఏజెంట్ సృష్టి చతుర్వేది (మోనీ రాయ్) ద్వారా ‘రా’కి చేరుతుంది. దీనిని తెలుసుకున్న నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అధిర్ దయాల్ (పూర్ణేందు భట్టాచార్య) తన ఆధ్వర్యంలో ఆ ఆపరేషన్‌ను చేపడతాడు.
1978లోనూ, ఇప్పుడు కూడా, దయాల్ పాత్రే కథలో ప్రధాన బలం. అజిత్ దోవల్‌ను పోలిన దయాల్ పాత్రలో చూపిన సాహసోపేతమైన చర్యలు సిరీస్‌కి హైలైట్‌గా నిలుస్తాయి. భారతదేశం ‘స్మైలింగ్ బుద్ధ’ పేరుతో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిన తర్వాత పాకిస్థాన్ చేసిన కుట్రలను, వాటిని భగ్నం చేసిన దయాల్ గూఢచారి చర్యలను కథ ఆకర్షణీయంగా చూపిస్తుంది.
మొత్తం ఐదు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సీరిస్‌లో ప్రతి ఎపిసోడ్ 25 నిమిషాల నిడివి కలిగినది. మధ్యలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా అనిపించినా, చివరి ఎపిసోడ్‌లో ఉత్కంఠ శిఖరానికి చేరుతుంది. పాకిస్థాన్‌లో ప్రమాదంలో ఉన్న సహోద్యోగి మనవరాలిని రక్షించే దయాల్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది.
దర్శకుడు ఫరూక్ కబీర్ అజిత్ దోవల్ స్ఫూర్తితో రూపొందించిన ఈ కథను విజువల్‌గా, టెన్షన్‌తో, భావోద్వేగాలతో నింపారు. గూఢచారి డ్రామాలు ఇష్టపడేవారికి ‘సలాకార్’ తప్పక చూడదగ్గ వెబ్ సీరిస్ అని చెప్పొచ్చు.