
తపాలా శాఖ డిజిటల్ సేవలందుబాటులోకి వచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (IPPB) ద్వారా కొన్ని డిజిటల్ సేవలు అందిస్తున్నప్పటికీ, ఇప్పుడు సాధారణ పోస్టాఫీసుల్లో జరిగే ట్రాన్సాక్షన్లను కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. దీని ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యం కలిగించడంతో పాటు, నకదు ఆధారిత లావాదేవీలను తగ్గించేందుకు ఇది ఒక ముందడుగు కానుంది.
ఆగస్టు నెల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసు కౌంటర్లలో ఆన్‌లైన్ చెల్లింపులు ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇండియా పోస్ట్ తన ఐటీ వ్యవస్థలో కొత్త అప్లికేషన్‌ను విజయవంతంగా అమలు చేసిన అనంతరం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై కస్టమర్లు తమ లావాదేవీలను QR కోడ్‌ల ద్వారా లేదా యుపిఐ ఆధారిత చెల్లింపుల ద్వారా సులభంగా చేయగలుగుతారు.
ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, పోస్టాఫీసు ఖాతాలు ఇప్పటి వరకూ యుపిఐ వ్యవస్థకు పూర్తిగా అనుసంధానించబడలేదు. దీంతో డిజిటల్ చెల్లింపులు సజావుగా జరగకపోతున్నాయి. కానీ తాజా అప్లికేషన్‌లో డైనమిక్ క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించగల విధంగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది డిజిటల్ ఇండియాలో మరో కీలక ముందడుగు.
ఈ కొత్త వ్యవస్థను ఐటీ 2.0 కింద తొలుత కర్ణాటకలోని మైసూరు, బాగలకోట్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ మెయిల్ ఉత్పత్తుల బుకింగ్‌కు డిజిటల్ చెల్లింపుల మార్గాన్ని విజయవంతంగా పరీక్షించారు.
తొలుత ప్రవేశపెట్టిన స్టాటిక్ QR కోడ్ వ్యవస్థలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ, వాటిని అధిగమించి మెరుగైన సిస్టమ్‌ను అమలు చేయడానికి శాఖ సిద్ధమవుతోంది. 2025 నాటికి దేశంలోని అన్ని పోస్టాఫీసులలో ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.