
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాబోయే రోజుల్లో ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకురావడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, త్వరలో ఫీల్డ్ విజిట్లు కూడా చేపడతామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రధానంగా ప్రభావం చూపుతున్న 10 వ్యాధులను గుర్తించి, వాటిని మ్యాపింగ్ చేయడం ద్వారా నిపుణుల సూచనల మేరకు చికిత్స విధానాలను అమలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో ప్రత్యేక ఎక్స్‌పర్ట్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ గ్రూప్‌లోని సైంటిస్టులు దేశ విదేశాల నుంచి వర్చువల్ విధానంలో ఇప్పటికే తొలి సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు.
వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందించే దిశగా ఈ ఎక్స్‌పర్ట్స్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా పని చేయనుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆధునిక సాంకేతికత, పరిశోధనల ఆధారంగా ఆరోగ్య సేవలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకొని వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ రాద్ధాంతమని, “కోడి గీతల కార్యక్రమం”గా మారిందని ఎద్దేవా చేశారు. సుపరిపాలన యాత్రలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదని, గ్రామాలు, పట్టణాలు, కళాశాలల్లో ఈ అంశంపై చర్చే లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు పాల్గొని రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


