
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అస్వస్థత ఎయిమ్స్‌లో చికిత్స
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనారోగ్యానికి గురవ్వడంతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో (AIIMS Delhi) చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారు జామున ఛాతీలో నొప్పి, అసౌకర్యం కలగడంతో ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ధన్‌ఖడ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
73 ఏళ్ల జగదీప్ ధన్‌ఖడ్ రాత్రి 2 గంటల సమయంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, అధికార బృందం అత్యవసరంగా ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ రాజీవ్ నారంగ్ (Dr. Rajeev Narang) ఆధ్వర్యంలో ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్లో (CCU) చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఆసుపత్రి వర్గాల ప్రకారం, ధన్‌ఖడ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్య బృందం, ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించుకుంది. అత్యవసర పరిస్థితి ఏమీ లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల కానుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగ్గా ఉన్నట్లు ప్రకటించినప్పటికీ, ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. అంతా క్రమంగా ఉంటే, ధన్‌ఖడ్‌ను ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే, చివరి నిర్ణయం వైద్యుల పరిశీలన అనంతరం తీసుకుంటారు.
ఉపరాష్ట్రపతికి అస్వస్థత గురికావడంతో, దేశవ్యాప్తంగా పలువురు నేతలు, ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు సహా రాజకీయ నేతలు ధన్‌ఖడ్ ఆరోగ్యంపై ఆసక్తిగా గమనిస్తున్నట్లు సమాచారం.హెల్త్ బులెటిన్ విడుదలైన తర్వాత ఉపరాష్ట్రపతి ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.