
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా “ఘాటీ”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’ తరవాత అనుష్క ప్రతి ప్రాజెక్ట్ ఎంపికలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కథానాయిక పాత్రకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలను మాత్రమే ఎంపిక చేస్తోంది. ‘భాగమతి’ విజయవంతం కాగా, ‘నిశ్శబ్దం’ ఫెయిలైంది. తర్వాత నవీన్ పోలిశెట్టి సరసన నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో మళ్లీ హిట్ అందుకుంది. ఇప్పుడు మరోసారి విరామం తర్వాత ఆమె “ఘాటీ” ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది, ఎందుకంటే దీనిని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. గతంలో అనుష్కతో చేసిన “వేదం” ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో అభిమానులు అంచనాలు పెంచుకున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యంతో వాయిదా పడింది. జూలై 11న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్రకటించారు. షూటింగ్ పూర్తయిందని చెబుతున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలినట్లు తెలుస్తోంది.
సిజి పనులు పూర్తికావడంతో ఆలస్యం తప్పదని సమాచారం. అందుకే మళ్లీ రిలీజ్ వాయిదా వేయనున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
అనుష్క అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


