
అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం కేశనపల్లి–గొల్లపాలెం మధ్య ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓఎన్జీసీ (ONGC) గ్యాస్ గ్యాథరింగ్ స్టేషన్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పదుల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. గ్యాస్ లీక్ కావడంతో కొంత మంది పరుగులు తీసినప్పటికీ, మరికొంత మంది ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రయత్నించారు.
గ్యాస్ లీకేజీ వాసన తీవ్రమైన స్థాయికి చేరుకోవడంతో, దాన్ని పీల్చిన తొమ్మిది మంది స్పృహ కోల్పోయారు. దీంతో అత్యవసరంగా సహచర సిబ్బంది వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో గ్యాస్ విపరీతంగా వ్యాపించడంతో అదే సమయానికి సమీప గ్రామాల ప్రజలు కూడా అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. గ్యాస్ ప్రభావం పెరిగి మరింత ప్రమాదం జరిగే ప్రమాదాన్ని ఆందోళన చెందిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న అమలాపురం ఆర్డీవో కొత్త మాధవి, రాజోలు సీఐ టీవీ నరేశ్ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీకేజీ పై దర్యాప్తు చేపట్టి, నివేదిక సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం, సాంకేతిక లోపం వల్ల గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.
ఓఎన్జీసీ గ్యాస్ స్టేషన్లో ఇటువంటి ప్రమాదం జరగడం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకూ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఓఎన్జీసీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సురక్షిత నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని, అవసరమైతే కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తి అయిన తర్వాత అధికారుల నుండి మరింత క్లారిటీ రావొచ్చని, ప్రజలు భావిస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే రానుంది.